Total Pageviews

Friday, January 31, 2014

ఆత్మకధ


చాలా రోజుల నుండి నా ఆత్మకధ వ్రాయాలనే కోరిక పెరుగుతూ వచ్చింది. ఆ కోరికతో పాటు, నాలో ఈ క్రింది అనుమానాలు కూడా కలిగాయి.

1)  అసలు ఆత్మకధ అంటే ఏమిటి?  

 జీవితంలో జరిగిన సంఘటలను మాత్రమే చెప్పడమా? లేక మన మనసుల్లో కలిగే వికార భావాలు, అవి ఎంత నీచమైనవి అయినా చెప్పుకోగలగడమా? అన్ని రకాల వికార భావాలు  కలిగినా, చివరికి విజేతగా నిలిచిన వాడే వ్రాయాలా? లేక జీవితంలో ఓడిపోయి, ఒక అపరిచితుడిలాగా మరణించేవాడి జీవితం కూడా వ్రాయబడవచ్చా?


2)   ఆత్మకధ ఎవరు వ్రాయాలి?

జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల ఆత్మకధలు చదివితే, చదివిన వారిలో ఉత్తేజం కలిగి ఆ స్థాయిని అందుకోవాలనే తపన మొదలవుతుంది. కానీ విజేతల జీవితాలే సామాన్యుడికి పాఠాలు చెప్పగలవా? నాలాంటి పరాజితులు వారి వారి ఆత్మకధలు వ్రాయకూడదా? అవి సమాజంలో ఉన్నవారికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వవా?


ఇంతకు పూర్వమే ఈ బ్లాగులో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అవి పూర్తిగా నా ఆవేదన, ఆక్రోశం నా పిల్లలకు తెలియచెప్పాలనే భావనతో మాత్రమే వ్రాసినవి. కానీ అవి నా పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపలేకపోగా, నా మీద వ్యతిరేకభావన ఇంకా పెరగడానికి దోహదపడ్డాయి. 

ఒక గంట క్రితం నాకు తెలిసిన విషయం, నేను వాళ్ళను పూర్తిగా పోగొట్టుకున్నాననే నిజాన్ని తెలియచేసింది.